చుక్కకూర

కావలసినవి:
చుక్కకూర: 2 కట్టలు (లావు కట్టలు)
మిర్చి: 6
టమాటో: 3-4
ఉల్లిపాయ: 1-2
పోపు సామాగ్రి: మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర
ఎండు మిర్చి: 1-2
వెల్లుల్లి: 2-3 రెబ్బలు
కరివేపాకు: 2-3 రెమ్మలు
ఉప్పు
కారం
సంబారు పొడి


తయారీ విధానం:
వేర్లు కోసి ఆకులని బొక్కెన నీళ్ళల్లో వేసి కడగాలి.
తరువాత ఆకులను చిన్నవిగా కోసి తెల్ల-గిన్నెలో వేయాలి.
మిరపకాయలు, టమాటోలు చిన్నవిగా కోసి గిన్నెలో వేయాలి.
గిన్నె పొయ్యి మీద పెట్టాలి.
మొదట పెద్ద మంటలో పెట్టినా, తరవాత సన్నని సెగలో పెట్టాలి.
ఈలోపు ఉల్లిపాయలు కోసి సిద్ధం చేసుకోవాలి.
నీళ్లు వేయనవసరంలేదు.
10-12 నిమిషాలలో  ఉడుకుతుంది (చుక్కకూర ఉడకడానికి 5 నిమిషాలు, మరియు టమాటో గట్రా ఉడకడానికి 10-12 నిమిషాలు)
ఉడికిన తరువాత పొయ్యి మీదనించి దింపి నీరు ఎక్కువగా ఉంది అనిపిస్తే ఇంకో పాత్రలోకి వంచేయాలి (తాజా ఆకు అయితే నీరు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది)

చిట్కా: ఈ అధికమయిన నీటిలో కొద్దిగా ఉప్పు వేసి చారు(సూప్) లాగా వడ్డించవచ్చు!

కొద్దిగా ఉప్పు, కారం, ఇంట్లో చేసుకున్న సంబారు పొడి వేసి, పప్పు-గుత్తితో ఎనిపి చుక్కకూర పక్కన పెట్టుకోవాలి.

బాండీ పొయ్యి మీద పెట్టి, తిరగమాత వేయాలి.
తిరగమాత లో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, చిదిమిన వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు వేయాలి.
ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత తెల్ల-గిన్నెలో ఉన్న ఆకు కూడా బాండీలో వేసి కొంచం తుక-తుక అనగానే ఆపేయాలి.

గమనిక: చుక్కకూరలో పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు వేయనవసరంలేదు.

Comments